బెల్లం అట్లు ఇది చాలా పాత కాలపు వంట. ప్రస్థుత తరానికి కాస్త తక్కువగా తెలుసు. ఇవి చేయడం చాలా తేలిక, జస్ట్ 5 నిమిషాల్లో తయారు. బెల్లం అట్లు దక్షిణాదిన అన్ని రాష్ట్రాల్లో ఉంది, కాని ఒక్కో ప్రాంతం ఒక్కో తీరుగా చేస్తారు. ఈ రెసిపీ నేను ఉడిపి స్టైల్లో చేస్తున్నా, చాలా ఏళ్ళ క్రితం ఉడుపి వెళ్ళినప్పుడు అక్కడ తిన్నాను ఈ అట్లు, చాలా రుచిగా ఉన్నాయ్. అక్కడి వారు కృష్ణుడికి నివేదిస్తారు కూడా ఈ అట్లని. అలాగే బెల్లం అట్లు గుంటూర్ జిల్లా తెనాలి లో ఉప్పు బజార్, మారీస్ పేట లో ఇళ్ళ ముందు ఆడవాళ్ళు ఓ పోయి పెట్టి వేస్తుంటారు, చాలా రుచిగా ఉంటాయి. ఎప్పుడైనా తెనాలి వెళితే ట్రై చేయండి. ఇప్పుడు నేను తెనాలి బెల్లం అట్లు చెప్పడం లేదు, ఉడుపి స్టైల్ అట్లని కొంచెం మార్చి మా స్టైల్ లో చేస్తున్నా.

కావలసినవి:

 • పొడి బియ్యం పిండి- ½ కప్
 • గోధుమ పిండి- 1 కప్
 • బెల్లం పొడి- ½ కప్
 • యాలకలపొడి- 3/4 చెంచా
 • సొంటి పొడి- 1 tsp
 • వంట సోడా- 2 చితికేల్లు
 • పచ్చి కొబ్బరి తురుము- 2 tbsps
 • నెయ్యి అట్లు కాల్చడానికి
 • నీళ్ళు తగినన్ని

విధానం:

Directions

0/0 steps made
 1. పదార్ధాలన్నీ ఓ గిన్నె లో వేసి బెల్లం కరిగేదాకా నీళ్ళు పోసి అట్ల పిండి జారుగా కలుపుకోండి
 2. బెల్లం పూర్తిగా కరిగాక వంట సోడా వేసి కలిపి నెయ్యి రాసిన అట్ల పెనం మీద పల్చగా అట్లు పోసుకుని, నెయ్యి తో రెండు పక్కలా కాల్చి తీసుకోండి.
 3. ఇవి అల్లం పచ్చడి లేదా కమ్మటి కొబ్బరి పచ్చడితో చాలా రుచిగా ఉంటాయ్

టిప్స్:

 • మీరు బెల్లం లో ఓ చెంచా నీళ్ళు వేసి పూర్తిగా కరిగించి వడకట్టి ఆ పాకాన్నికూడా పిండి లో కలుపుకోవచ్చు
 • ఈ అట్లకి మాత్రం పెనాన్ని గుడ్డ పీలిక లేదా టిష్యూ పేపర్ తో నెయ్యి వేసి రుద్ది అట్లు పోసుకోండి, ఉల్లిపాయ బంగాళాదుంపతో రుద్దకండి
 • ఈ అట్లు నెయ్యి తో కాలిస్తే చాలా రుచిగా ఉంటాయ్, నూనె తో కంటే