ఫిర్నీ ఇది ముస్లిమ్స్ ఎక్కువగా చేసుకునే స్వీట్. ఎక్కువగా రమజాన్ మాసాల్లో, ఇంకా పెళ్ళిళ్ళకి ఎక్కువగా చేస్తుంటారు ఫిర్నీ. ఇది హైదరాబాద్ లో అయితే రంజాన్ మాసం లో హలీం అమ్మే దగ్గరే చిన్న చిన్న కుండల్లో పోసి అమ్ముతుంటారు.

రంజాన్ మాసం లో సాయంత్రాలు ఫ్రెండ్స్ తో కలిసి హలీం, కాబాబులు, ఫిర్నీ లు తినడానికి వెళ్ళడాలు భలే సరదాగా ఉంటుంది. నాకు ఏంటో ఇష్టమైన స్వీట్ ఇది.

ఫిర్నీ లు ఎన్నో ఫ్లేవర్స్ లో అందుబాటులోకి వచ్చాయ్, అన్నీ వేటికవే ప్రేత్యేకం.  ఫిర్నీ చేసే తీరుని బట్టి కూడా రుచి పెరుగుతుంది. ఆ టిప్స్ అన్నీ రెసిపీ లో చాలా వివరంగా ఉంచాను

ఫిర్నీ ఒక్కోరు ఒక్కో తీరులో చేస్తారు, కొన్ని సార్లు ముద్దగా, గడ్డలు గా అవుతుంది. అప్పుడు  తినేందుకు అంత బాగుండదు. అలా ముద్దగా కాకుండా ఉంటూ రవ్వ రవ్వగా తెలుస్తూ వెన్నలా జారిపోవాలి, అది నిజమైన ఫిర్నీ అంటారు ముస్లిం సోదరులు.

సహజంగా ఫిర్నీ మట్టి పాత్రలో పోసి ఫ్రిజ్ లో ఉంచి చల్లగా తింటారు. మట్టి పాత్రలో పోసిన ఫిర్నీ కి మామూలు గిన్నెల్లో వేసిన ఫిర్నీ రుచిలో తేడ ఉంటుంది. నేను ఆ లోటు తెలియనివ్వకుండా ఎలా చేసుకోవాలో టిప్స్ లో వివరంగా ఉంచాను.

ఫిర్నీ ఏ బియ్యం తో అయినా చేసుకోవచ్చు, కానీ బాస్మతీ బియ్యం లేదా చిట్టి ముత్యాలు బియ్యం తో చేస్తే చాలా రుచిగా ఉంటుంది.

ఇందులో నేను డ్రై ఫ్రూట్స్ ఏవి వేయలేదు, మీకు నచ్చితే 5-6 నానబెట్టిన బాదం, జీడిపప్పు పలుకులు వేసి దిమ్పుకోవచ్చు ఆఖరున

మీకు కుంకుమపువ్వు అందుబాటు లో లేకపోతే దింపే ముందు రోజ్ వాటర్ వేసుకోవచ్చు.

ఇవి కూడా ట్రై చేయండి:

రవ్వ కేసరి
అటుకుల రవ్వ కేసరి
సేమియా కేసరి

కావలసినవి:

 • బాస్మతి/చిట్టి ముత్యాలు బియ్యం- 1/2 కప్
 • చిక్కని పాలు- 1 లీటర్
 • పంచదార- 3/4 కప్
 • యాలకల పొడి- 1 tsp
 • కుంకుమ పువ్వు చిటికెడు
 • నెయ్యి- 1/4 కప్

విధానం:

Directions

0/0 steps made
 1. బియ్యాన్ని కడిగి గంట నానబెట్టి రవ్వగా పట్టుకోవాలి. నీళ్ళు వేయకండి. బరకగా ఉండాలి బియ్యం
 2. నెయ్యి కరిగించి అందులో బరకగా రుబ్బుకున్న బియ్యం రవ్వ వేసి ఎర్రగా వేపుకోవాలి
 3. రవ్వ వేగాక చిక్కని పాలు పోసి అడుగు నుండి కలుపుతూ పాలు సగం అయ్యేదాకా మరిగించాలి
 4. పాలు సగం అయ్యాక పంచదార, యాలకలపొడి, కుంకుమ పువ్వు వేసి కలుపుతూ, అట్ల పిండి అంత చిక్కగా అయ్యేదాకా ఉడికించి దిమ్పెసుకోవాలి
 5. దింపే ముందు నచ్చితే నానబెట్టిన బాదంజీడిపప్పు పలుకులు వేసుకోవచ్చు.
 6. ముందు రోజే కడిగి నీళ్ళలో నానబెట్టిన మట్టి పాత్రల్లో ఫిర్నీ పోసి ఫ్రిజ్ లో 5-6 గంటలు ఉంచి సర్వ్ చేసుకోండి.

టిప్స్:

 • ఫ్రిజ్ లేని వారు బయట కూడా ఉంచుకోవచ్చు
 • మట్టి పాత్రలు లేని వారు ఫిర్నీ ని ఇంకాస్త చిక్కగా ఉడికించి కప్ లో పోసి ఫ్రిజ్ లో ఉంచుకోవచ్చు