ఖుస్కా…ఇది తమిళనాడు లో చాలా ఫేమస్. ఏ ఫంక్షన్లోనైనా ఇది ఉండాల్సిందే! ఇంకా చిన్న చిన్న బండ్ల మీద కూడా దీన్ని అమ్ముతుంటారు! ఇది నాన్ వెజ్ కర్రీస్ తోను, ఇంకా రైతా తోనూ చాలా రుచిగా ఉంటుంది. ఇదే ఖుస్కా లో నాన్-వెజ్ వేసి కూడా చేస్తారు!

ఇది తెలంగాణా లో ప్రతీ ఫంక్షన్ కి ఎలా బాగారన్నం చేస్తారో, అంత కామన్ గా చేస్తుంటారు తమిళనాడు లో. ఏదైనా వీకెండ్ కి లేదా స్పెషల్ అకేషన్ కి ఇది ట్రై చేసి చుడండి, అందరికి ఎంత నచ్చుతుందో మీరే చూస్తారు!

ఇది నేను చిన్నప్పుడు చెన్నై వెళ్ళినప్పుడు సాలిగ్రామం లో ఓ ఫ్రెండ్ ఇంట్లో తిన్నాను, చాలా నచ్చింది, ఎంతో ఆరోమేటిక్. దీని సువాసన ఇల్లంతా నిండిపోయింది. చాలా ఎంజాయ్ చేసాను. ఇక అప్పటి నుండి చెన్నై వెళితే కచ్చితంగా చెన్నై ఫ్రెండ్స్ ని అడిగి చిన్న హోటల్స్, బండ్లు ఏవైనా సరే వాళ్ళు భలే చేస్తారు ఖుస్కా అంటే చాలు వెళ్ళిపోయి తృప్తిగా తినోచ్చేవాడిని. కొందరిని అడిగి తెలుసుకుని మా ఇంట్లో చేసిపెట్టాను అందరికి నచ్చింది, అప్పటినుండి మేము చేసుకుంటూనే ఉన్నాం. మా కొలతల్లో చేస్తే చాలా ఎంజాయ్ చేస్తారు!

కావలసినవి:

 • బాస్మతి బియ్యం-1 కప్(గంటపాటు నానబెట్టినవి)
 • నెయ్యి- ½ కప్
 • ఉల్లిపాయ- మీడియం సైజు తరుగు
 • పచ్చిమిర్చి-3 చీలికలు
 • పండిన టమాటో- 2
 • పుదినా-1/2 కట్ట
 • కొత్తిమీర- ½ కట్ట
 • పెరుగు- ½ కప్
 • యలకలు-4
 • లవంగాలు-4
 • దాల్చిన చెక్క-1 ఇంచ్
 • అనాసపువ్వు- 1
 • జాజి కాయ- చిన్న పలుకు
 • బిరియాని ఆకు-1
 • జీలకర్ర- 1 tsp
 • సోంపు- 1 tsp
 • సాల్ట్
 • అల్లం వెల్లూలి ముద్ద- 1 tsp
 • పసుపు-1/4 చెంచా
 • కారం- 1 tsp
 • గరం మసాలా-1/2 tsp
 • నీళ్ళు- 1 కప్

విధానం:

Directions

0/0 steps made
 1. ప్రెషర్ కుక్కర్ లో నెయ్యి కరిగించి, అందులో యలకలు, లవంగాలు, చెక్కా, అనాసపువ్వు, జాజి కాయ, బిరియాని ఆకు వేసి వేయించుకోండి
 2. ఇప్పుడు జీలకర్ర, సోంపు వేసి వేయించి ఉల్లిపాయ పచ్చిమిర్చి చీలికలు వేసి ఉల్లిపాయలు ఎర్రగా వేగే దాక వేపుకోండి
 3. ఇప్పుడు అల్లం వెల్లూలి ముద్ద వేసి వేయించి అందులో పండిన టొమాటో ముక్కలు, పసుపు, ఉప్పు కారం, గరం మసాల వేసి టొమాటోలు మెత్తగా గుజ్జుగా అయ్యేదాకా నిదానంగా కుక్ చేసుకోండి
 4. ఇప్పుడు ½ కప్ కమ్మటి పెరుగు వేసి బాగా కలుపుతూ నిదానంగా పెరుగులోంచి నెయ్యి పైకి తేలేదాకా కలుపుతూ కుక్ చేసుకోండి
 5. నెయ్యి పైకి తేలాక కొత్తిమీర, పుదినా తరుగు వేసి బాగా కలుపుకుని గంట పాటు నానా బెట్టిన బాస్మతి బియ్యం వడకట్టి వేసి, నిదానంగా గింజ విరగకుండా ఓ నిమిషం పాటు వేపుకోండి హై-ఫ్లేం మీద
 6. ఇప్పుడు కప్ నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టి కేవలం హై-ఫ్లేం మీద మాత్రమే ఓ విసిల్ రానిచ్చి, 20 నిమిషాలు వదిలేయండి
 7. 20 నిమిషాల తరువాత కుక్కర్ మూత తీసి అడుగునుండి అట్లకాడతో కలుపుకొండి. అంతే ఘుమఘుమలాడే ఖుస్కా తయార్
 8. దీన్ని మీరు రైతా తో, ఏదైనా మసాలా కర్రీ తో, నాన్ వెజ్ కర్రీస్ తో ఎలా తిన్నా చాలా బాగుంటుంది.

టిప్స్:

 • ఇందులో మీరు కచ్చితంగా అనాసపువ్వు జాజి కాయ వేస్తేనే అసలు రుచి
 • టొమాటోలు మెత్తగా గుజ్జులా ఉడికితేనే రుచి, పుల్లటి పెరుగు వాడకండి
 • బాస్మతి బియ్యానికి నీళ్ళ కొలత కప్ కి కప్ నీళ్ళు, అది కూడా గంట పాటు నానబెడితేనే
 • అదే మామూలు బియ్యానికి గంట పాటు నానబెట్టినదానికి కప్ కి కప్ ముప్పావ్ నీళ్ళు, 2 విసిల్స్ హై-ఫ్లేం మీద రానివ్వాలి