“గోంగూర” దీన్ని తెలుగు తల్లి అంటారు ఆప్యాంగా భోజన ప్రియులు!!! ఎంత చెప్పినా తక్కువే దీని రుచి. ఎలా చేసినా ఎందుకో కొన్ని భలే రుచిగా అనిపిస్తాయ్, అందులో గోంగూర కూడా ఒకటి. పచ్చడి, పులుసు, నిలవ పచ్చడి, రైస్ ఏది చేయండి ఇంకా కావాలనిపిస్తుంది. అందుకేనేమో పక్క రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా వారు మన గోంగూర పచ్చడంటే ప్రాణం పెట్టేస్తారు!

గోంగూరతో ఎన్నో రకాల పచ్చడులు నిలవ పచ్చడులు పెట్టొచ్చు. గోంగూర మెంతి కారం, ఉప్పు గోంగూర, పులిహోర గోంగూర, గోంగూర పండుమిర్చి, గోంగూర టమాట, గోంగూర దబ్బకాయ, గోంగూర నువ్వుల పచ్చడి. ఇలా ఎన్నో ఉన్నాయ్. అన్నింటికీ బేస్ గోంగూరే కాని దేని రుచి దానిదే!

ఈ నువ్వుల గోంగూర పచ్చడి గుంటూర్ జిల్లా లో ఎంతో ఫేమస్! ఈ తరం వారు కాస్త తగ్గించారు చేయడం కాని ఒకప్పుడు ఫంక్షన్లు అంటే గుంటూర్ జిల్లా పరిసరాల్లో గోంగూర పచ్చడి, వంకాయ కూర ఉండాల్సిందే!

ఈ నువ్వుల గోంగూర పచ్చడి నేను రెండు కొలతల్లో కింద వివరంగా రాసాను చుడండి. ముందు నేను సుమారు 300 gms వచ్చే పచ్చడి కొలత చెబుతాను ఆ తరువాత kg పచ్చడి కొలత ఉంటుంది. పద్ధతి రెండింటికి ఒక్కటే.

గోంగూర పచ్చడి కి సహజంగా కాస్త నూనె, ఉప్పు ఎక్కువ అవసరం పడతాయ్, కానీ ఈ నువ్వుల గోంగూర పచ్చడికి ఉప్పు ఎక్కువ పట్టదు.

గోంగూర పచ్చడి అంటే వెల్లూలి ఉండాలి, ఉంటేనే రుచి పచ్చడి లో ఊరి. కానీ ఈ నువ్వులు వేసిన పచ్చడి లో వెల్లూలి వేస్తే నువ్వుల కమ్మదనం పోతుంది. అందుకే చిటికెడు ఇంగువ వేసాను.

గోంగూర నిలవ పచ్చడులకి మాత్రం ఎప్పుడూ ముదురు ఎర్ర గోంగూర వాడుకోవాలి. ఎర్ర గోంగూర పచ్చడికి పులుపు . ముదురు గోంగూర వల్ల పచ్చడి ఊరక  తరకలుగా తెలుస్తుంది, లేత ఆకు పేస్టులా అయిపోతుంది.

ఈ పచ్చడి కొద్ది కొలత కాబట్టి ఎండుమిర్చి వాడుతున్నా, kg కొలతకి చేసే వారు మాంచి ఘాటు కారం గల ఎండుకారం వాడుకోవడం మేలు.

గోంగూర  పచ్చడికి నూనె ఎప్పుడు ఎక్కువగా ఉండాలి, అంటే పైకి తేలాలి అప్పుడే పచ్చడి నిలవా రుచి ఉంటుంది.

ఈ పచ్చడి లో నువ్వులు ఉంటాన బయట అయితే 20 లేదా నెల రోజులు నిలవుంటుంది, ఫ్రిజ్ లో అయితే 2-3 నెలలు నిలవుంటుంది. ఆ పైన కూడా పచ్చడి పాడవదు కాని, నువ్వుల వల్ల రుచి తగ్గుతుంటుంది.

ఇవి కూడా ట్రై చేయండి:

టమాటో నువ్వుల పచ్చడి
పచ్చి మామిడికాయ మిరపకాయల తొక్కు పచ్చడి
అరటి దూట పెరుగు పచ్చడి
పచ్చిమామిడి కాయ పచ్చడి
టమాటో కొత్తిమీర పచ్చడి
చుక్కకూర పచ్చడి

కావలసినవి:

 • ముదురు ఎర్ర గోంగూర ఆకులు- 250 gms
 • పప్పు నూనె/వేరు సెనగ నూనె- 175ml(3/4 కప్)
 • నువ్వులు- 50 gms(1/4 కప్)
 • ఉప్పు- 2 tbsps(30 gms)
 • కారం గల ఎండుమిర్చి- 15-20
 • పచ్చిమిర్చి తరుగు- 3 tbsps
 • మెంతులు- 1 tbsp
 • ఆవాలు- 1 tbsp
 • ఇంగువా- రెండు చిటికెళ్ళు
 • పసుపు- 1 tsp
 • చింతపండు- 4-5 రెబ్బలు

kg పచ్చడి కొలతకి:

 • kg ముదురు ఎర్ర గోంగూర ఆకు
 • నూనె- 1/2 లీటర్
 • నువ్వులు- 200gms
 • ఉప్పు- 100gms
 • కారం-150gms
 • మెంతులు- 30gms
 • ఆవాలు- 30gms
 • చింతపండు- 30 gms
 • పసుపు- 2 tsp
 • ఇంగువ- 1 tsp

విధానం:

Directions

0/0 steps made
 1. మూకుడు లో నువ్వులు వేసి కలుపుతూ చిటపటలాడేదాక వేపుకోవాలి. ఎర్రగా వేగాక దింపి చల్లార్చాలి.
 2. అదే మూకుడులో మెంతులు వేసి ఎర్రగా వేపుకోవాలి, మెంతులు కాస్త వేగాక ఆవాలు వేసి మెంతులు మంచి సువాసన వచ్చేదాకా వేపుకోవాలి.
 3. తరువాత ఎండుమిర్చి, ఇంగువా కూడా వేసి ఎర్రగా వేపి దింపి చల్లార్చాలి.
 4. అదే మూకుడు లో నూనె వేడి చేసి అందులో కడిగి నీడన ఆరబెట్టిన గోంగూర ఆకులని మాత్రమే వేసి ఎర్రగా నూనె పైకి తేలేంత వరకు కలుపుతూ వేపుకోవాలి.
 5. ఇందులోనే ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి కూడా వేసి వేపుకోవాలి.
 6. గోంగూర ఎర్రగా వేగి నూనె పైకి తేలేదాకా వేపుకోవాలి, దీనికి 17-20 నిమిషాల టైం పడుతుంది. అలా వేపకపోతే పచ్చడి నిలవుండదు. ఎర్రగా వేగాక దిమ్పెసుకోండి.
 7. చల్లారిన నువ్వులని మిక్సీ లో వేసి బరకగా పొడి చేసుకోండి(వేడి మీద చేస్తే ముద్దవుతుంది).
 8. అలాగే ఆవాలు, మెంతులు ఎండుమిర్చి వేసి మెత్తని పొడి చేసుకోండి.
 9. చల్లారిన గోంగూరలో ఆవాల కారం, నువ్వుల పొడి బాగా కలిపి పట్టించండి.
 10. పూర్తిగా చల్లారాక గాజు సీసాలో ఉంచుకోండి. ఉప్పు తగ్గితే తరువాత కూడా కలుపుకోవచ్చు.

kg కొలతకి కొన్ని టిప్స్:

 • మెంతుల, ఆవాలు మాత్రమే వేపుకుని పొడి చేసుకోండి.
 • కారం లో మెంతుల ఆవాల పొడి, ఉప్పు, నువ్వుల పొడి  బాగా కలిపి వేగిన గోంగూరలో కలుపుకోండి.
 • ఉప్పు ఎప్పుడూ కాస్త తగ్గించి కలిపి, తరువాత రుచి చూసి కలుపుకోండి.