“గోంగూర పులావ్” ఇది చాలా స్పీసీ గా ఘాటుగా పుల్లగా రుచిగా ఉంటుంది. ఇది అందరికి నచ్చి తీరుతుంది. ఇది తిన్నాక అందరు మెచ్చి తీరతారు. ఈ పులావ్ నేను కడుపు నింపేది కాదు…మనసు నింపే పులావ్ అంటుంటాను. ఇది సెలవ రోజుల్లో ఓ సారి ట్రై చేసి చుడండి. సూపర్బ్ అని అనడం ఖాయం! కుక్కర్ లో కూడా ఎలా చేసుకోవచ్చో రెసిపీ చివర్లో ఉంచాను చుడండి.

కావలసినవి:

 • సోన మసూరి బియ్యం- 1 కప్( గంట పాటు నానబెట్టినవి)
 • జీడిపప్పు- పిడికెడు
 • గోంగూర- 75 gms
 • కరివేపాకు- ఓ రెబ్బ
 • పచ్చిమిర్చి- 4
 • టమాటో- 3
 • పుదినా- ½ కట్ట
 • కొత్తిమీర- ½ కట్ట
 • ఉల్లిపాయలు- 3
 • అల్లం వెల్లూలి పేస్ట్- 1 tsp
 • ఉప్పు
 • పసుపు- ¼ చెంచా
 • బిరియాని ఆకులు-2
 • షాహీ జీర- 1 tsp
 • అనసపువ్వు- 2
 • జాజి కాయ- సెనగబద్దంత ముక్క
 • మరాటి మొగ్గ-1
 • యాలకలు-3
 • లవంగాలు- 3
 • దాల్చిన చెక్క- చిన్న ముక్క

విధానం:

Directions

0/0 steps made
 1. ½ కప్ నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయ చీలికలు కొద్దిగా ఉప్పు వేసి క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుని తీసి పక్కనుంచుకోండి.
 2. ఇప్పుడు అదే నూనె లో మసాలా దినుసులన్నీ, కరివేపాకు, జీడిపప్పు వేసి వేగనివ్వండి. ఆ తరువాత పసుపు, అల్లం వెల్లూలి పేస్టు వేసి వేపుకుని పచ్చిమిర్చి వేసి కాసేపు మగ్గనివ్వండి.
 3. ఆ తరువాత టమాటో ముక్కలు వేసి బాగా మగ్గనిచ్చి, గోంగూర ఆకులు వేస్సి బాగా కలిపి మూత పెట్టి గోంగూర మెత్తగా మగ్గనివ్వండి.
 4. గోంగూర మగ్గాక కప్ ముప్పావు నీళ్ళు పోసి, కాస్త ఉప్పు వేసి ఎసరుని తెర్ల కాగానివ్వండి. ఎసరు మరుగుతున్నప్పుడు మాత్రమే గంటపాటు నానబెట్టుకున్న బియ్యం వేసి బాగా కలిపి కొత్తిమీర తరుగు, పుదినా తరుగు, వేయించిన ఉల్లిపాయ వేసి కలిపి మూత పెట్టి హై-ఫ్లేం మీద 8 నిమిషాలు, లో-ఫ్లేం మీద 7 నిమిషాలు ఉడికించి, స్టవ్ ఆపేసి 15 నిమిషాలు వదిలేయండి.
 5. 15 నిమషాల తరువాత అడుగు నుండి కలుపుకోండి. ఘుమఘుమలాడే గోంగూర పులావ్ రెడీ!
 6. ఇది ఉల్లిపాయ రైతా లేదా కీర రైతా తో గాని, నాటు కోడి పులుసుతో గాని చాలా రుచిగా ఉంటుంది.

టిప్స్:

 • కుక్కర్ లో వండుకునే వారు 2 విసిల్స్ హై-ఫ్లేం మీదా రానిచ్చి 30 నిమిషాలు వదిలేయండి.
 • ఎసరు మరుగుతున్నప్పుడు మాత్రమే బియ్యం వేయాలి లేదంటే పులావ్ ముద్దగా ఉంటుంది.
 • ఎర్ర గోంగూర వాడుకుంటే సరైన పులుపు ఉంటుంది పులావ్ కి.