చారులందు జీలకర్ర చారు వేరయా అని మీరు ఇది తిన్నాక అంటారు. అంత కమ్మటి చారు ఇది. చాలా సింపుల్. పసి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నాన్-వెజ్ తిన్నప్పుడు ఈ చారు తో 4-5 ముద్దలు తింటే హాయిగా అనిపిస్తుంది పొట్టకి. ఇంకా వేసంగి లో, అజీర్తితో ఇబ్బంది తో ఉన్నా ఈ చారు తో తినండి చాలా తేలికగా అనిపిస్తుంది. వెజ్ తినే వారు ఏ వేపుడు తో తిన్నా చాలా బాగుంటుంది. సహజంగా చారులో అందరు మిరియాల చారు, టమాట చారునే చేస్తుంటారు కాని చారు లో ఎన్నో రాకలున్నై, వాము చారు కూడా చాలా బాగుంటుంది. అది నేను మరో సారి పోస్ట్ చేస్తా.

కావలసినవి:

 • జీలకర్ర- 1.5 tsps
 • కందిపప్పు- 1 tbsp
 • ఎండు మిర్చి-8-10
 • చింతపండు- నిమ్మకాయంత
 • నీళ్ళు- 750 ml
 • కరివేపాకు- 2 రెబ్బలు
 • కొత్తిమీర- 2 tbsps
 • ఆవాలు – 1 tsp
 • ఇంగువ- 1/8 చెంచా
 • పసుపు- ¼ చెంచా
 • ఉప్పు- రుచికి సరిపడా

విధానం:

Directions

0/0 steps made
 1. కందిపప్పు, జీలకర్ర, ఎండుమిర్చిని బాగా కడిగి నీళ్ళు పోసి 30 నిమిషాలు నానబెట్టండి
 2. 30 నిమిషాల తరువాత మెత్తని పేస్టు చేయండి
 3. ఇప్పుడు గిన్నె లో రుబ్బుకున్న పేస్టు, చింతపండు పులుసు, నీళ్ళు, పసుపు, ఉప్పు, కరివేపాకు కాడలతో సహా వేసి బాగా కలిపి పొయ్యి మీద పెట్టి లో-ఫ్లేం మీద ఓ పొంగు రానివ్వండి మూత పెట్టి.
 4. ఓ పొంగొచ్చాక మూత తీసి మరో 4-5 నిమిషాలు లో-ఫ్లేం మీద మరనివ్వండి
 5. తాలిమ్పుకి నూనె వేడి చేసి అందులో ఆవాలు, ఇంగువ, కొత్తిమీర వేసి వేపి చారు లో పోసి మూత పెట్టేయండి.
 6. 30 సెకన్ల తరువాత సర్వ్ చేసుకోండి.

టిప్స్:

 • జీలకర్ర సరైన కొలతల్లో వేసుకోండి, ఏ మాత్రం ఎక్కువైనా రుచి పాడవుతుంది