“తోటకూర మజ్జిగ చారు” చాలా త్వరగా అయిపోయే కమ్మని రెసిపీ. ఇది నాకు చాలా ఇష్టం. ఎప్పుడూ చేసుకునే మజ్జిగ చారు/పులుసుకి బదులు ఇది చేసుకుంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.

ఇది మా ఇంట్లో చాలా ఎక్కువగా చేస్తుంటాము. ఇది చేసిన రోజున ఓ వేపుడు, ఓ రోటి పచ్చడి చేస్తే చాలు. పరిపూర్ణమైన భోజనం అనిపిస్తుంది.

సహజంగా మజ్జిగ పులుసులు మనకి తెలుసు చేస్తుంటాము, కాని ఇది ఆకూర రుచి తో ఎంతో బాగుంటుంది. ఇదే కాదండి ఇంకా బచ్చలికూర, కాబేజీ, మునక్కాడ, బూడిద గుమ్మడి, ముల్లంగి, ముల్లంగి ఆకుతో కూడా మజ్జిగ పులుసు చేసుకోవచ్చు. ఒక్కోదానిది ఒక్కో రుచి, ఒక్కో ప్రయోజనం.

ఈ మజ్జిగ పులుసు లో నేను వెల్లూలి వాడాను. నచ్చని వారు వదిలేయోచ్చు. అల్లం ఎక్కువగా ఉంటె చాలా బాగుంటుంది. కావాలంటే అదీ తగ్గించుకోవచ్చు. కారం వాడడం కంటే, పచ్చిమిర్చి కారం చాలా బాగుంటుంది.

సహజం గా అందరూ నన్ను మెంతులు చేదుగా ఉంటాయ్ స్కిప్ చేయొచ్చా అని అడుగుతుంటారు. మెంతు నూనె లో ఎప్పుడు ముందు వేసి అది కాస్త వేగాక ఆవాలు వేసి అవి చిటపటమన్నాక మిగిలిన తాలింపు సామాను వేసుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది.

మెంతులు వేగితే రుచి, సువాసన లేదంటే చేదుగా ఉండిపోతుంది.

కావలసినవి:

 • తోటకూర- 2 పెద్ద కప్పుల తరుగు
 • పెరుగు- 1/2 లీటర్
 • నీళ్ళు- 250 ml
 • పచ్చిమిర్చి- 2-3
 • కరివేపాకు- 1 రెబ్బ
 • ఉప్పు
 • అల్లం – 1 ఇంచ్
 • వెల్లుల్లి
 • ఆవాలు- 1 tsp
 • జీలకర్ర- 1 tsp
 • మెంతులు- 1/2 tsp
 • పచ్చి సెనగపప్పు- 1 tsp
 • మినపప్పు- 1 tsp
 • ఎండుమిర్చి-2
 • పసుపు- 1/4 tsp
 • నూనె- 2 tsps
 • నీళ్ళు- 1/4 కప్

విధానం:

Directions

0/0 steps made
 1. వెల్లుల్లి, అల్లం కచ్చాపచ్చాగా దంచి పక్కనుంచుకోండి
 2. నూనె వేడి చేసి అందులో మెంతులు వేసి కాస్త వేపి ఆ తరువాత ఆవాలు వేసి చిటచిటలాడించి జీలకర్ర, మినపప్పు, సెనగపప్పు, ఎండుమిర్చి, ఓ రెబ్బ కరివేపాకు వేసి వేపుకోవాలి
 3. ఆ తరువాత తోటకూర తరుగు, పసుపు, పచ్చిమిర్చి , అల్లం వెల్లూలి ముద్ద వేసి 3-4 నిమిషాల పాటు పసరు వాసన పోయే దాకా ఫ్రై చేసుకోవాలి
 4. 4 నిమిషాలకి పసరు వాసన పోతుంది, అప్పుడు కాసిని నీళ్ళు పోసి మూత పెట్టి మీడియం ఫ్లేం మీద పొడిగా పొడిగా అయ్యేదాకా పూర్తిగా మగ్గనిచ్చి దిమ్పెసుకోండి
 5. పెరుగుని బాగా చిలికి నీళ్ళు, ఉప్పు  పోసి కలిపి చల్లార్చుకున్న తోటకూర వేసి కలుపుకోండి.
 6. ఇది అన్నం చపతీలోకి చాలా బాగుంటుంది.

టిప్స్:

 • తోటకూర కాడలు కూడా చాలా బాగుంటాయ్ ఈ పులుసు లో.