ధాభాల్లో ఇచ్చే కాజు పనీర్ మసాలా అందరికి ఇష్టమే! ఆ రుచే వేరు!!! అక్కడికక్కడ వేడి వేడిగా రోటీ పుల్కా నాన్ లోకి నంజుకుని తింటుంటే ఆ అనుభవం మాటల్లో చెప్పలేము! సరిగ్గా అలాంటి కర్రీ నే ఇదే. మీకు సరిగా అదే రుచి వస్తుంది! ఇది అందరికి నచ్చుతుంది.

కావలసినవి:

 • పనీర్- 250 gms
 • జీడిపప్ప్పు- ¼ కప్
 • ఉల్లిపాయ తరుగు- ఓ పెద్ద కప్
 • టమాటో పేస్టు- ½ కప్
 • పచ్చి మిర్చి చీలికలు- 3
 • కొత్తిమీర- 2 tbsps
 • అల్లం వెల్లూలి పేస్టు- 1 tbsp
 • చిలికిన పెరుగు- 2 tbsps
 • నెయ్యి- 1 tbsp
 • ఫ్రెష్ క్రీం- 2 tsps
 • నూనె- ¼ కప్
 • ఉప్పు
 • జీలకర్ర- 1 tsp
 • కారం- 1 tbsp
 • వేయించిన జీలకర్ర పొడి- 1 tsp
 • ధనియాల పొడి- 1 tsp
 • గరం మసాలా- ½ tsp

విధానం:

Directions

0/0 steps made
 1. 2 tbsps నూనె వేడి చేసి అందులో జీడిపప్పు వేసి ఎర్రగా వేపి పక్కనుంచుకోండి.
 2. ఇప్పుడు జీలకర్ర వేసి వేయించి అందులో సన్నని ఉల్లిపాయ తరుగు వేసి ఎర్ర వేపువాలి.
 3. సగం పైన వేగిన తరువాత పచ్చిమిర్చి చీలికలు వేసి ఉల్లిపాయలు ఎర్రగా వేపుకోండి.
 4. ఉల్లిపాయలు వేగాక, అప్పుడు అల్లం-వెల్లూలి పేస్టు వేసి కారం, ఉప్పు, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి మసాలాలని ఎర్రగా వేపుకోండి.
 5. మసాలాలు బాగా వేగాక అప్పుడు టమాటో పేస్టు వేసి టమాటోల నుండి నీరు ఇగిరిపోయి ముద్దగా అయ్యేదాకా వేపుకోండి.
 6. టొమాటోల నుండి నూనె పైకి రాగానే 150 ml నీళ్ళు పోసి చిక్కబడనివ్వండి కూరని.
 7. కూర చిక్కబడుతుండగా పెరుగు వేసి బాగా కలుపుతూనే ఉండండి, పెరుగు కూరలో కలిసేదాక.
 8. కూరలో నుంచి నూనె పైకి రాగానే అప్పుడు పనీర్ ముక్కలు, జీడిపప్పు వేసి 4-5 నిమిషాలు వేగనివ్వండి.
 9. కూర దింపే ముందు కొత్తిమీర తరుగు, క్రీం, నెయ్యి వేసి కలుపుకుని దిమ్పెసుకోండి.
 10. ఇది రోటీ, నాన్,బటర్ నాన్ లోకి చాలా బాగుంటుంది.

టిప్స్:

 • జీడిపప్పు 30 నిమిషాలు నీళ్ళలో నానబెట్టి ఎర్రగా వేపితే ఎక్కువసేపు క్రిస్పీ గా ఉంటాయి కూరలో.
 • ఉల్లిపాయలు ఎర్రగా వేగాకపోతే కూరకి రుచి రాదు. ఎర్రగా వేగితే కురకి మాంచి చిక్కటి గ్రేవీ వస్తుంది.
 • గ్రేవీ ఎక్కువ కావాలంటే ఉల్లిపాయలు టొమాటోల పేస్టు అన్నీ పెంచుకుని ఉప్పు, కారం మసాలాలు తగినట్లు వేసుకోండి.