పాలక్ పనీర్…ఇది ఫేమస్ పంజాబీ రెసిపీ!!! ఇది పేరుకి పంజాబీ రెసిపీ కాని యావత్ ప్రపంచంలో దీనికి  అభిమానులున్నారు. దీని రుచి సువాసన కమ్మదనానికి ఎవ్వరైనా మళ్ళీ కావాలంటారు.ఇది చపాతీ, రోటీలు, పుల్కా, ఇంకా జీరా రైస్ లో చాలా రుచిగా ఉంటుంది.

ఇది చేయడం చాలా తేలిక! అన్నీ దాదాపుగా ప్రతీ ఇంట్లో ఉండే పదార్దాలే! దీనికి 5-6 కట్టల పాలకూర, కాస్త పనీర్ ఉంటె చాలు. పనీర్ ఎలా చేయాలో నేను ఇదివరకే పోస్ట్ చేశాను, మీరు ఇంట్లోనే బెస్ట్ పనీర్ చేసుకోవచ్చు.

రెస్టారంట్ స్టైల్ palak పనీర్ అంటే మాత్రం తప్పక ఫ్రెష్ క్రీం(పాల మీగడ) వాడాలి కూర దింపే ముందు. ఇంకా పైన 1 tsp క్రీం వేసే సర్వ్ చేస్తారు! మీకు క్రీం దొరకకపోతే వదిలేసి 1 tsp నెయ్యి వేసి దిమ్పుకోవచ్చు.

ఇవి కూడా ట్రై చేయండి:
పనీర్ తయారి విధానం, హేల్తీ పనీర్ బటర్ మసాలా, పనీర్ హరా ప్యాజ్, గోంగూర పనీర్, టమాటో పనీర్ మసాలా, దాల్ మఖ్నీ, జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు

కావలసినవి:

 • పాల కూర ఆకులు- 5-6 కట్టలవి
 • పచ్చిమిర్చి- 3
 • పనీర్- 200 gms
 • ఉల్లిపాయ తరుగు- 1 కప్
 • అల్లం వెల్లూలి ముద్ద- 1 tsp
 • నూనె- 1/4 కప్
 • వెన్న- 3 tbsps
 • నెయ్యి- 1 tsp
 • ఫ్రెష్ క్రీం- 3 tbsps
 • జీలకర్ర- 1 tsp
 • ఎండు మిర్చి -3
 • కారం- 1 tsp
 • సాల్ట్- 1 tsp
 • ధనియాల పొడి- 1 tsp
 • కసూరి మేథీ- 1 tsp
 • వేయించిన జీలకర్ర పొడి- 1 tsp
 • గరం మసాలా- 1/2 tsp
 • నీళ్ళు- 150 ml

విధానం:

Directions

0/0 steps made
 1. పాలకూర ఆకుల వరకు తుంచి నీళ్ళలో 5-6 నిమిషాలు ఉడికించి వెంటనే తీసి చన్నీళ్ళు పోయండి, దీని వల్ల పాల కూర రంగు మారదు.
 2. చల్లారిన పాలకూర, పచ్చిమిర్చి. 1/4 కప్ నీళ్ళు  వేసి మెత్తని పేస్టు చేయండి
 3. మూకుడు లో నూనె వేడి చేసి అందులో జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేపుకోండి
 4. ఆ తరువాత ఉల్లిపాయలు ఎర్రగా అయ్యేదాకా వేపుని అల్లం వెల్లూలి పేస్టు వేసి వేపుకోవాలి
 5. ఇప్పుడు పాల కూర పేస్టు, కారం, గరంమసాలా, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, ఉప్పు, నలిపిన కసూరి మేథీ వేసి బాగా కలిపి పాల ఆకు మగ్గి నూనె పైకి తేలేదాకా మీడియం ఫ్లేం మీద మూత పెట్టి ఉడికించండి.
 6. ఆ తరువాత బటర్ వేసి  కలిపి వెన్న కరిగి పాలకూర కలిసిపోయి నూనె పైకి తేలేదాకా ఉడికించుకోవాలి.
 7. నూనె పైకి తేలకా 150 ml నీళ్ళు పోసి మూతపెట్టి చిక్కబడనివ్వండి.
 8. ఆ తరువాత గోరు వెచ్చని నీళ్ళలో 15 నిమిషాలు నానబెట్టిన పనీర్ ముక్కలు వేసి ముక్కలు చిదరకుండా కలిపి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోండి
 9. దింపే ముందు సువాసన కోసం 1 tsp నెయ్యి, నచ్చితే ఫ్రెష్ క్రీం వేసి కలిపి దిమ్పెసుకోండి రెస్టారంట్ టేస్ట్ వస్తుంది

టిప్స్:

 • వెన్నా, నెయ్యి కావాలంటే తగ్గించుకోవచ్చు.
 • వెన్నకి బదులు అచ్చంగా నెయ్యే వాడుకోవచ్చు. నెయ్యి ఆఖరున కనీసం 1/2 tsp అయినా వేసుకోండి. అప్పుడు రుచి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది.
 • పనీర్ వేడి నీళ్ళలో నానబెడితే సాఫ్ట్ అవుతుంది. ఫ్లేవర్స్ పనీర్ కి బాగా పడతాయి.