“పావ్ భాజీ” ఇది ముంబై లో పుట్టిన ఇండియన్ ఫాస్ట్ ఫుడ్. 1850 ప్రాంతాల్లో ముంబై టెక్స్ టైల్ ఇండస్ట్రీస్ లోని కార్మికులకి ఏదైనా త్వరగా అందించే ఫుడ్ అవసరం పడింది, అక్కడున్న పనికి వారికున్న సమయానికి.
ఇది ఓ చిన్న పూరి గుడిసెలో మొదలైంది, ఆ తరువాత ఇది కార్మికుల స్నాక్ గా మారిపోయింది, ఆ తరువాత అది కాస్త మిల్ ఓనర్ల స్పెషల్ ఐపోయింది, ఆ తరువాత వారి వేడుకల్లో స్పెషల్ రెసిపీ గా మారిపోయింది. ఆ తరువాత స్టార్ హోటళ్ళలోకి వెళ్ళిపోయింది. ఇది స్టార్ హోటళ్ళలో ఎంత అందంగా హంగులతో సర్వ్ చేస్తున్నా , ఎక్కువమంది స్ట్రీట్ సైడ్ దొరికే పావ్ భాజీ నే ఇష్టపడుతుంటారు.
ఇది పుట్టింది ముంబైలోనే అయినా యావత్ దేశమంతా దీనికి అభిమానులున్నారు, ఎవరికి తోచిన విధంగా వారు వారి ప్రాంతాలకు తగినట్లు వారు మసాలాలు మార్చేసుకున్నారు. అలా మార్చినా దీని రుచికి ఫిదానే తిన్న ఎవ్వరైనా! నేను మీకు ఒరిజినల్ పావ్ భాజీ రెసిపీ చెప్తున్నా.
ఇది చేయడం చాలా తేలిక, కొన్ని పద్ధతులు పాటిస్తే పక్కా రెసిపీ గారంటీ!! మేము సాయంత్రాలు రోజు తినే భోజనం, రోటీలు పైన బోరు కొట్టిన రోజు పక్కా దీనితో డిన్నర్ ముగించేస్తాం. కడుపు నిండడం తో పాటు మనసు నిండిపోతుంది. మీకు పక్కా నాలాంటి అనుభూతే కలుగుతుంది, మా కొలతల్లో చేస్తే!

కావలసినవి:

 • నూనె- 2 tbsps
 • బటర్- ½ కప్
 • ఉల్లిపాయ తరుగు- 3/4 కప్
 • కాప్సికం తరుగు- 3/4 కప్
 • తాజా బటాని- 3/4 కప్
 • అల్లం వేల్లూలి పేస్టు- 1 tbsp
 • టమాటో తరుగు- ½ కప్
 • మెత్తగా ఉడికిన్చుకున్న బంగాలదుంప- 3/4 కప్
 • కసూరి మేథి- 1 tsp
 • పావ్ భాజీ మసాలా పొడి- 2 tsps
 • కాశ్మీరీ కారం- 1 tsp
 • సాల్ట్
 • కొత్తిమీర తరుగు- 2 tbsps
 • పావ్-2

విధానం:

Directions

0/0 steps made
 1. పాన్ లో నూనె, 2 tbsps బటర్ కరిగించి అందులో ఉల్లిపాయ, కాప్సికం, బటాని వేసి 2 నిమిషాలు కుక్ చేసుకోండి. అంటే ఉల్లిపాయలు మగ్గేదాక ఫ్రై చేసుకోండి.
 2. ఇప్పుడు అల్లం వెల్లూలి పేస్టు వేసి నిమిషం పాటు ఫ్రై చేసుకుని, టమాటో వేసి మెత్తగా మగ్గించుకోండి.
 3. ఇప్పుడు సాల్ట్, కసూరి మేథి, కారం, పావ్ భాజీ మసాలా వేసి బాగా ఫ్రై చేసుకుని ఉడికిన్చుకున్న బంగాళాదుంప ముద్ద వేసి బాగా కలుపుకోండి.
 4. ఇప్పుడు మేషర్ తో లేదా పప్పు గుత్తితో ఉడికిన వెజిటబుల్స్ అన్నింటిని బాగా మెత్తగా మాష్ చేసుకోండి. ఎంత బాగా మాష్ చేసుకుంటే భాజీ అంత క్రీమీగా ఉంటుంది.
 5. ఇప్పుడు 300 ml నీళ్ళు పోసి హై-ఫ్లేం మీద మెత్తగా మాష్ చేసుకుని దగ్గర పడేదాకా కుక్ చేసుకోండి. భాజీ మరీ ముద్దగా అయితే మరి కాసిని నీళ్ళు పోసుకోండి.
 6. ఇప్పుడు కొత్తిమీర, ¼ కప్ బటర్ వేసి బాగా కలుపుకుంటూ భాజీ దగ్గర పడే దాక కుక్ చేసుకుని దిమ్పెసుకోండి.
 7. ఇప్పుడు 2 tsps బటర్ వేసి కరిగించుకుని దానిమీద పావ్ ని మధ్యకి కట్ చేసి, బటర్ ని బాగా పీల్చుకుని క్రిస్పీగా అయ్యేదాకా రోస్ట్ చేసుకోండి.
 8. ఇప్పుడు భాజీ తో పాటు పావ్, ఇంకా నిమ్మకాయ, ఉల్లిపాయతో వేడి వేడిగా సర్వ్ చేసుకోండి.

టిప్స్:

 • ఈ రెసిపీ కి బటర్ ఎంత ఎక్కువుంటే అంత రుచి. కొన్ని ఎలా తినాలో అలా తింటేనే అసలు మజా అంతేనా కాదా. కాబట్టి దీని విషయం లో బటర్ వేయడం లో లోటు చేయకండి.
 • నేను ఫ్రోజెన్ బటాని వాడను అవి త్వరగా మగ్గిపోతాయ్, మీరు తాజా బటానీ వాడుకునేట్లైతే 30 నిమిషాలు వేడి నీటిలో ఉంచి వాడుకోండి, చక్కగా కుక్ అవుతాయ్.
 • కసూరి మేథీ వేస్తే భాజీ కి మంచి రుచి, కాశ్మీరీ చిల్లి పౌడర్ వేయడం వలన భాజీ మాంచి ఫ్లేవర్ తో పాటు, రంగు వస్తుంది.
 • మీకు భాజీ బాగా చిక్కగా ఉన్నట్లు అనిపిస్తే మళ్ళీ కాసిని నీళ్ళు పోసుకుని కుక్ చేసుకోండి.
 • పావ్ ని కాల్చే ముందు బటర్ కరిగించి ఆ బటర్ లో కొందరు ¼ చెంచా పావ్ భాజీ మసాలా, 1 చిటికెడు కసూరి మేథీ, ¼ చెంచా కొత్తిమీర తరుగువేసి దాని పైన పావ్ ఉంచి రెండు వైపులా బటర్ లో ఎర్రగా కాలుస్తారు, మీరు అలా కూడా చేసుకోవచ్చు. నేను జస్ట్ బటర్ లో కాల్చాను అంతే.