సీసన్ తో సంబంధం లేకుండా ఎప్పుడైనా అందరూ ఇష్టంగా తాగే డ్రింక్ అంటే “బాదం పాలు”. ఇది అన్ని వయసుల వారు తాగొచ్చు, చాలా ఇష్టంగా తాగుతారు కూడా.

హేల్తీ డ్రింక్స్ అని ఏవేవో కాకుండా, ఇలాంటివి తాగగలిగితే చాలా మంచిది. రుచికి రుచి…ఆరోగ్యానికి ఆరోగ్యం.

నా స్టైల్ బాదం పాలు కమ్మగా చిక్కగా, ఇంకా ఇంకా తాగాలనిపించేలా ఉంటుంది. ఇది వేడిగా చల్లగా ఎలా తాగినా చాలా బాగుంటుంది.

ఇందులో నేను కుంకుమ పువ్వు వాడను ఫ్లేవర్ కోసం, నచ్చని వారు స్కిప్ చేసుకోవచ్చు. కాని వేస్తే బాదం పాలకి రంగు సువాసన వస్తుంది. లేదా బాదం ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు 3-4 చుక్కలు.

నేను బాదాంని ఉడికించి పేస్టు చేసి వాడను. రాత్రంతా నానబెట్టిన బాదం వాడుకోవచ్చు కదా గ్రైండ్ చేసి, ఉడికించే బదులు అని అనిపిస్తుంది. అలాగా చేయొచ్చు, కానీ ఉడికిస్తే పాలు పచ్చివాసన రావు, ఎక్కువ చిక్కగా, కమ్మగా ఉంటాయి పాలు. పచ్చి బాదం పేస్టు వేస్తే పాలు ఎక్కువ సేపు మరగాలి.

హేల్తీ బాదం మిల్క్ కావాలనుకునే వారు పంచదారకి బదులు బెల్లం పాకం వడకట్టి వాడుకోవచ్చు. వివరాలు టిప్స్ లో ఉంచాను చుడండి.

ఇవి సాయంత్రాలు పిల్లలు స్కూల్ నుండి ఇంటికొచ్చాక ఓ కప్ ఇచ్చి చుడండి ఓ 10 రోజులు, కచ్చితంగా మార్పు కనిపిస్తుంది.

ఇవి కూడా ట్రై చేయండి:

కోల్డ్ కోకో
మాంగో కోకోనట్ డిలైట్
ఆరెంజ్ పాప్సికల్స్
చాక్లెట్ లస్సీ
మలై కుల్ఫీ
కీవి కూలర్
డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్

కావలసినవి:

 • బాదం పప్పు- 75 gms
 • పాలు- 1/2 లీటర్
 • పంచదార/బెల్లం- 1/4-1/3 కప్
 • కుంకుమ పువ్వు- చిటికెడు

విధానం:

Directions

0/0 steps made
 1. బాదంపప్పుని లీటర్ నీళ్ళలో వేసి మెత్తగా ఉడకనివ్వండి, లేదా కుక్కర్ లో 3 విసిల్స్ రానివ్వండి.
 2. ఉడికించిన పప్పు పొట్టు తీసేయండి.
 3. 100ml పాలల్లో పొట్టు తీసుకున్న బాదాం వేసి మెత్తని పేస్టు చేసుకోండి.
 4. పాలని మరిగించండి. మరుగుతున్న పాలల్లో కుంకుమ పువ్వు, పంచదార వేసి ఓ పొంగు రానివ్వండి.
 5. పాలు ఓ పొంగొచ్చాక బాదం పేస్టు వేసి మరో 2-3 పొంగు రానివ్వండి మీడియం ఫ్లేం మీద. కనీసం 10 నిమిషాలు మరగనివ్వండి. (పాలని మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది).
 6. చిక్కబడిన పాలని వేడిగా లేదా చల్లగా ఎలా అయినా తీసుకోవచ్చు. చల్లగా తాగాలంటే ఫ్రిజ్ లో 2 గంటలు ఉంచి తాగండి, సర్వ్ చేసే ముందు కొన్ని బాదం పలుకులు వేసుకున్నా చాలా బాగుంటుంది.

టిప్స్:

 • పాలల్లో బెల్లం వేసుకోదలిచిన వారు లాస్ట్ లో దింపే ముందు 1 tbsp నీళ్ళు వేసి బెల్లాన్ని కరిగించి వడకట్టిన బెల్లం పానకం వేసి కలుపుకోవచ్చు.