“షీర్ కుర్మా” ఇది రంజాన్ మాసం అయిపోయాక ఈద్ రోజున కచ్చితంగా ప్రతీ ముస్లింల ఇంట చేస్తారు, అందరికి పంచి వారి ఆనందాన్ని తెలిజేస్తారు!!! నిజంగానే ఇది తింటే ఆనందమే కలుగుతుంది. అంత రుచిగా ఉంటుంది.

నాకు చిన్నతనం నుండి ముస్లిం ఫ్రెండ్స్ ఉండడం వల్ల వారి రుచులు ఇంటింటికీ ఎలా మారుతున్నాయ్, ఏమి వేయడం వల్ల ఎ రుచోస్తుంది, ఎలా చేస్తే ఇంకా బాగా రుచోస్తుంది, వెనుకటికి అసలు ఎలా చేసేవారు ఇలాంటివి ఎన్నో తెలుసుకుందుకు అవకాసం దొరికింది. పైగా నార్త్ ఇండియా ముస్లిమ్స్ ఫ్రెండ్స్ మూలంగా ఇంకా బాగా నేర్చుకోగలిగాను. వేసే ఒక్కో పదార్ధం, వండే తీరు, వీటి వల్ల ఎలా రుచోస్తుందో స్పష్టంగా తెలుసుకోగలిగాను.

అసలు ఈద్ రోజు చేసే వంటకాల హడావిడి అంతా రెండు రోజుల ముందే మొదవుతుంది. ఆ హడావిడి, బందువుల రాకపోకలు, భోజనానికి రమ్మనిపిలుపులు అబ్బా ఆ హడావిడి అంతా ఇంతా కాదు. నా ఫ్రెండ్స్ ఇల్లంతా పూలతో, అత్తర్లుతో గుభాలించి పోతుంది. నిజం చెప్పాలంటే ఆ సువాసన 4 ఇళ్ళ అవతలకి రావాల్సిందే!!! నేను సరదాగా మీ వంటలు, మీ అత్తర్ల సువాసనని డామినేట్ చేస్తున్నాయ్ అంటాను, అంత రిచ్ ఫ్లేవర్స్ తో ఉంటాయ్ ఆ రోజు స్పెషల్స్.

ఇక ఈద్ రోజున తప్పక మా ఫ్రెండ్స్ ఇంటి నుండి 5-6 రకాల షీర్ కుర్మాలు, బిర్యానీలు, స్వీట్స్, ఇంకా బోలెడు వస్తాయ్. అందులో అందరు వాళ్ళు చేసిన షీర్ కుర్మా రుచి ఎలా ఉంది అని ఫీడ్ బ్యాక్ ఇవ్వమని నన్నే అడుగుతారు, అందులో ఏం తగ్గింది, ఏం వేస్తే బాగుండేది, ఏది ఎక్కువయ్యింది లాంటివన్నీ, చెప్పి చెప్పి నేను బెస్ట్ గా చేయడం నేర్చుకున్నా. అదే మీకు షేర్ చేస్తున్నా.

మీరు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ గా వస్తుంది ఈ కొలతల్లో చేస్తే!!

కావలసినవి:

 • సెవియా- 1 చుట్టూ
 • చిక్కటి పాలు- 1 లీటర్
 • కండెన్స్డ్ మిల్క్- 300 ml
 • బాదం- 10
 • జీడిపప్పు- 15
 • పిస్త- 10
 • ఎండు ద్రాక్ష- ¼ కప్
 • ఎండు కర్జూరం-6
 • చిరోంజి- 2 tbsps
 • నెయ్యి- ½ కప్
 • యాలకల పొడి- ½ tsp
 • రోజ్ వాటర్- ½ tsp(ఆప్షనల్)

విధానం:

Directions

0/0 steps made
 1. ముందు రోజే రాత్రే కర్జూరం, జీడిపప్పు, బాదం, పిస్తా ఇవి నానబెట్టుకోండి.
 2. తెల్లరాక ఖర్జూరం లోంచి గింజలు తీసేసి పొడవుగా ముక్కలు కోసుకోండి, బాదం చెక్కు తీసేసి పొడవుగా ముక్కలు కోసుకోండి, పిస్తా సన్నగా తరుక్కోండి, జీడిపప్పు పలుకులుగా కట్ చేసుకోండి.
 3. 3 చెంచాల నెయ్యి కరిగించి అందులో తరిగి ఉంచుకున్న dry fruits అన్నీ ఇంకా చోరిన్జీ పప్పు కూడా వేసి ఫ్రై చేసుకోండి.
 4. ఇప్పుడు సెవియా వేసి గోల్డెన్ కలర్ వచ్చే దాక వేపుకుని తీసి పక్కనుంచుకోండి
 5. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నెలో మాత్రమే చిక్కటి పాలు పోసి కండెన్స్డ్ మిల్క్ వేసి మరగనివ్వండి. పాలని అడుగు నుండి కలుపుతూ ఉండండి, లేదంటే అడుగు పట్టేస్తుంది
 6. పాలు ఓ పొంగు రాగానే ఎండు ద్రాక్ష వేసి మరో 2 నిమిషాలు మరగానివండి (ఎండు ద్రాక్షా నానబెట్టనవసరం లేదు)
 7. ఇప్పుడు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, సేవియా వేసి బాగా కలుపుకుని లో-ఫ్లేం మీద 12-15 నిమిషాల పాటు నిదానంగా ఉడకనివ్వండి.
 8. ఇందులో యాలకల పొడి ఇంకా ఫ్లేవర్ కావాలనుకుంటే ½ tsp రోజ్ వాటర్ వేసుకోండి ఫ్లేవర్ కోసం.
 9. ఇవన్ని వేసి ఓ పొంగురానిచ్చి దిమ్పెసుకోండి.
 10. సర్వ్ చేసే ముందు ఇంకొన్ని బాదం పలుకులు పిస్తా పలుకుల పైన వేసి సర్వ్ చేసుకోండి
 11. ఇది వేడిగా చల్లగా ఎలా తిన్నా చాలా రుచిగా ఉంటుంది

టిప్స్:

 • డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా రాత్రంతా నానితే చాలా రుచిగా ఉంటుంది తినేప్పుడు, అది కుదరనప్పుడు కనీసం 4-5 గంటల పాటు వేడి నీటిలో నానబెట్టుకోండి. బాగా ననైతేనే రుచి
 • ఈ కుర్మాని మామూలు సేమియా తో చేస్తే అసలు రుచిరాదు. దీని రుచి దీనిదే…దాని రుచి దానిదే! ఈ సన్నటి సేమియా వెన్నలా కరిగిపోతుంది నోట్లో.
 • కండెన్స్డ్ మిల్క్ వేస్తే చాలా రిచ్ గా, క్రీమీ గా ఉంటుంది, కండెన్స్డ్ మిల్క్ లేకపోతే పావు కిలో పంచదార వేసుకోండి, ఇది లీటర్ పాలకి కొలత. ముస్లిమ్స్ తీపి కాస్త ఎక్కువగానే తింటారు. మీకు తగినట్లు అడ్జస్ట్ చేసుకోండి
 • సేమియా వేసాక ఈ కుర్మా ని మరీ ఎక్కువ సేపు కుక్ చేసుకోకండి, చల్లారక మరీ గట్టిగా అయిపోతుంది.
 • ఇంకా కొంచెం పాలు గా ఉండగానే దిమ్పెసుకోండి. అప్పుడు చల్లారక పర్ఫెక్ట్ గా ఉంటుంది టెక్స్చర్!