“జర్దా పులావు” ఇది ప్రేత్యేకించి ముస్లింల పెళ్ళిళ్ళలోనూ ఏదైనా ప్రేత్యేకమైన సందర్భాల్లోనూ చేస్తుంటారు. ఇది పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ తో పాటు యావత్ నార్త్ ఇండియా లోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ కొందరు చేస్తుంటారు. కాని ప్రాంతానికి ప్రాంతానికి వ్యత్యాసం ఉంది. నేను వీటన్నింటిని కలిపి బెస్ట్ జర్దా పులావు చేస్తున్నా. ఇది మీకు తిన్నకొద్ది తినాలనిపిస్తుంది, చాలా రుచిగా ఉంటుంది. కనీసం 2 రోజులు నిలవుంటుంది కూడా. ఎప్పుడైనా ఇంట్లో పార్టీస్ అప్పుడు ఈ రెసిపీ ట్రై చేసి చుడండి, ఎంతగా మెచ్చుకుంటారో అందరు.

కావలసినవి:

 • బాసుమతి బియ్యం- 1 కప్ ( గంట పాటు నానబెట్టినవి)
 • దాల్చిన చెక్క- 1 ఇంచ్
 • లవంగాలు- 4
 • యలకలు- 4
 • బిరియాని ఆకు- 1
 • రెడ్ కలర్- 2 tsps
 • నీళ్ళు- 1.5 లీటర్లు

ధం కోసం:

 • నెయ్యి- ½ కప్
 • జీడిపప్పు- ¼ కప్
 • బాదం సగానికి చీరినవి-8
 • ఎండు ద్రాక్ష- 1/4కప్
 • సన్నని ఎండు కొబ్బరి చీలికలు- 8
 • పంచదార- 3/4 కప్
 • చెర్రీస్- 8
 • గులాబ్ జామున్- 2
 • రసగోల్లలు- 2

విధానం:

Directions

0/0 steps made
 1. ముందుగా నీళ్ళని మరిగించి అందులో బిరియాని ఆకు, యాలకలు, లవంగాలు, దాల్చిన చెక్క, వేసి నీళ్ళని మరగనివ్వండి.
 2. నీళ్ళు మరుగుతున్నప్పుడు రెడ్ కలర్ వేసి బాగా కలుపుకుని, నానాబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసి 80% ఉడికించుకోండి, హై ఫ్లేం మీద. ఇది ఉడకడానికి 10 నిమిషాలు సరిపోతుంది.
 3. అన్నం ఇంకాస్త పలుకున్డగానే నీళ్ళని వడకట్టి అన్నాన్ని ఓ ప్లేట్ లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వండి.
 4. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నెలో నెయ్యి కరిగించి dry fruits అన్నీ వేసి, వేపి తీసి పక్కనుంచుకోండి.
 5. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లార్చుకున్న అన్నాన్ని ఓ లేయేర్ వేసి దాని మీద ¼ కప్ చొప్పున పంచదార ఓ లేయర్ గా వేయండి, పైన dry fruits వేసి దాని పైన మళ్ళీ రైస్ ఓ లేయర్, దాని పైన పంచదార ఓ లేయర్, dry fruits ఓ లేయర్ ఇలా వేసుకోండి.
 6. పైన ఇప్పుడు ఓ గులాబ్ జామున్ ని రసగోల్లా ని చిదిమి వేసుకోండి, అలాగే చేర్రీస్ కూడా వేసుకోండి.
 7. ఇప్పుడు టిష్యూ నాప్కిన్స్ పైన వేసి, దాని పైన కొద్దిగా నీళ్ళు చిలకరించి మూత పెట్టి 6 నిమిషాలు మీడియం ఫ్లేం మీద, 7 నిమిషాలు లో-ఫ్లేం మీద ధం చేసుకోండి. ఆ తరువాత 15 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసి వదిలేయండి.
 8. 15 నిమిషాల తరువాత అడుగు నుండి కలుపుకుని, సర్వ్ చేసుకునే ముందు మరో గులాబ్ జామున్ క్రష్, రసగోల్లా క్రష్ వేసుకోండి.

టిప్స్:

 • బాసుమతి బియ్యం సంవత్సరం కంటే పాతవి తెచ్చుకుంటే మెతుకు మెతుకుగా ఉడుకుతుంది, బియ్యాన్ని హై-ఫ్లేం మీద మాత్రమే నీళ్ళు తెర్లుతున్నపుడు మాత్రమే వేయాలి, లేదంటే అన్నం మెత్తబడుతుంది.
 • రంగు వేయకపోతే మీకు కలర్ఫుల్ గా ఉండదు పులావు, నచ్చకపోతే వదిలేయచ్చు.
 • మెతుకు పట్టుకుంటే ఇంకా కాస్త పలుకు ఉండాలి ఆ స్టేజి 80 శాతం అంటే.
 • మీరు ధం చేసుకునేప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నె వాడకపోతే మీకు పులావు మాడిపోతుంది.
 • మీకు గులాబ్ జామున్స్ చిన్న చిన్నవి కూడా వేసుకోవోచ్చు అవి ఇంకా బాగుంటాయ్.
 • సర్వ్ చేసుకునే ముందు ఇంకొన్ని జమున్స్, రసగోల్లాలు వేసుకుంటేనే ఇంకా రుచి.